ఘట్‌కేసర్, అక్టోబర్ 30 (ప్రజావాణి):
హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిరంతర విద్యుత్ సరఫరా, పర్యావరణహిత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో విస్తరణలో భాగంగా నిర్మించిన నూతన కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంస్థ కార్యకలాపాలు, క్యాంపస్ విస్తరణ, నూతన భవనంలోని ఆధునిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ మరోసారి భారీ స్థాయిలో విస్తరించడం అంతర్జాతీయ సంస్థలకు నగరంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 48 వేల మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ, తాజాగా పది లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నూతన కార్యాలయ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా యువతకు నైపుణ్య శిక్షణ, ప్రాయోగిక అనుభవం కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని విద్యార్థులకు కూడా ఐటీ రంగంలో సమాన అవకాశాలు కల్పించాలని, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇన్ఫోసిస్ ప్రతినిధులను కోరారు.
తెలంగాణ యువతకు మెరుగైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఐటీ, పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
