prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 8:00 am Digital Edition : PRAJA VANI

పెద్ద శంకరంపేట కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ – అక్రమాలకు చెక్

*పెద్ద శంకరంపేట కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ – అక్రమాలకు చెక్*

*కల్తీ కల్లు అమ్మితే లైసెన్స్ రద్దు*

*పెద్ద శంకరంపేట మండలంలో నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ – 5 గ్రామాల్లో కల్లు నమూనాల సేకరణ – అనుమతి లేని 2 దుకాణాలపై కేసులు – 160 లీటర్ల కల్లు ధ్వంసం*

*ప్రజావాణి న్యూస్ పెద్ద శంకరంపేట న్యూస్, ప్రతినిధి బాలరాజు:*

కల్లు దుకాణాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ తన పంజా విసిరింది. పెద్ద శంకరంపేట మండలాన్ని టార్గెట్ చేసుకుని గత నెల రోజులుగా వరుస దాడులు, తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ A. చంద్రయ్య మరియు డిప్యూటీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) L. నర్సింహారెడ్డి గార్ల ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ స్పెషల్ ఆపరేషన్ ను చేపట్టారు
ఆపరేషన్ కు మెదక్ SHO సర్కిల్ ఇన్స్పెక్టర్ A. వెంకటేష్ గారు సారథ్యం వహించారు. ఆయన తన సిబ్బందితో కలిసి మండలంలోని ప్రతి గ్రామంలోని కల్లు దుకాణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కల్లు నాణ్యతను పరీక్షించడానికి, అందులో ఎలాంటి కల్తీ పదార్థాలు కలుపుతున్నారో తెలుసుకోవడానికి శాస్త్రీయంగా శాంపిళ్లను సేకరించారు.
09-09-2026 రోజున బూరుగుపల్లి గ్రామం, విరోజి పల్లి , ముక్తా లక్ష్మాపూర్ , తిరుమలాపూర్ గ్రామాల్లో ఉన్న కల్లు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అంతేకాకుండా గ్రామంలోని కల్లు దుకాణంలో కూడా తనిఖీ చేశారు. అక్కడి నుండి 3 కల్లు శాంపిళ్లను నిబంధనల ప్రకారం సేకరించి, సీల్ వేసి ఎక్సైజ్ కెమికల్ ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత కల్తీ తేలితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.
13-10-2026 రోజు నిర్వహించిన దాడుల్లో కోలపల్లి గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న రెండు కల్లు దుకాణాలను అధికారులు గుర్తించారు. వెంటనే ఆ దుకాణాలను సీజ్ చేసి, అక్కడ నిల్వ ఉంచిన సుమారు 160 లీటర్ల కల్లును అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ అక్రమ దుకాణాల నిర్వహణకు బాధ్యులైన వారిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ దాడితో అక్రమంగా దుకాణాలు నడుపుతున్న వారిలో వణుకు పుట్టింది.
శివాయపల్లి , తిరుమలాపూర్ , పెద్ద శంకరంపేట గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో మళ్లీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం కల్లు నమూనాలను సేకరించారు.
ఈ సందర్భంగా మెదక్ ఎక్సైజ్ CI ఏ. వెంకటేశం మాట్లాడుతూ, జిల్లాలో ఎవరైనా కల్తీ కల్లు విక్రయించినా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అనుమతులు లేకుండా అక్రమంగా కల్లు దుకాణాలు నిర్వహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. ఈ తనిఖీలు ఇకపై నిరంతరం కొనసాగుతాయి అని హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమాల్లో మెదక్ ఎక్సైజ్ SI వినోద్ కుమార్, SI T. వినయ్ కుమార్ తో పాటు ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.