prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 9:42 pm Digital Edition : PRAJA VANI

పెద్ద పోచారంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

పెద్ద పోచారంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు
కూసుమంచి, అక్టోబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు, బాలికలు ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను తలపై ఎత్తుకొని ఒకచోట చేరి తెలంగాణ జానపద పాటలు పాడుతూ సందడి చేశారు. చిన్నారులు సైతం బతుకమ్మలను అలంకరించి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.