prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 9:29 am Digital Edition : PRAJA VANI

పిఎల్ఆర్ బోనస్ సాధనలో ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర

*పిఎల్ఆర్ బోనస్ సాధనలో ఏఐటీయూసీ పెద్దన్న పాత్ర*

*సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*

*ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

బొగ్గు గని కార్మికులందరికీ పిఎల్ఆర్ బోనస్ సాధించడంలో జాతీయ కార్మిక సంఘం ఏఐటియుసి పెద్దన్న పాత్ర పోషించిందని, పిఎల్ఆర్ బోనస్ సాధించి పెట్టిన నాలుగు జాతీయ కార్మిక సంఘాలకు, అందులో పెద్దన్న పాత్ర పోషించిన ఏఐటీయూసీ సంఘానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) తరపున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామని యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్ లు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఏరియాలోని కేకే-5, కేకే ఓసిపి, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్స్, కేకే-1 డిస్పెన్సరీ, ఏరియా జిఎం కార్యాలయం, ఎంపిటిసి, ఏరియాలోని అన్ని గనులు, విభాగాలపై నిరసన వ్యక్తం చేసి సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శైలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, కంది శ్రీనివాస్ లు మాట్లాడుతూ, బొగ్గు అని కార్మికులకు మొదటగా పిఎల్ఆర్ బోనస్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన దివంగత కార్మిక నేత టిబి విటల్ రావు కు విప్లవ అభినందనలు తెలిపారు. ఆయన రష్యా పర్యటన సందర్భంగా అక్కడి కార్మికులకు అందుతున్న బోనస్ విధానాన్ని పరిశీలించి, భారతదేశంలోని కార్మికులకు సైతం బోనస్ అందే విధంగా పార్లమెంట్ లో చట్టం తీసుకురావడానికి కృషి చేశారని గుర్తు చేశారు. దాని ఫలితంగా బొగ్గు గని కార్మికులకు సుమారు 1960 సంవత్సరం నుంచి బోనస్ చట్టం అమలులోకి వచ్చిందని, ప్రారంభంలో 300 రూపాయల నుంచి మొదలైన బోనస్ ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి 1,10,250 రూపాయల వరకు కార్మికులకు అందుతున్న విషయాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. సింగరేణి సంస్థకు వచ్చే లాభాలను కార్మికులకు పంచాలనే డిమాండ్ ను సైతం ఏఐటియుసి మొదటగా ముందుకు తీసుకువచ్చిందని, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో దివంగత కార్మిక నేత కెఎల్ మహేంద్ర మాట్లాడుతూ సింగరేణికి నష్టాలు వస్తే కార్మికుల వేతనాల్లో కోత విధిస్తామని ప్రభుత్వం చెప్పడం సరైన విధానం కాదని, సంస్థకు లాభాలు వస్తే ఆ లాభాల్లో కార్మికులకు సైతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ సింగరేణి సంస్థకు లాభాలు వస్తే 10 శాతం లాభాలను కార్మికులకు వాటాగా ఇస్తామని ప్రకటించి, ఇచ్చిన మాటకు కట్టుబడి కార్మికులకు లాభాల వాటా అందించిన విషయం సింగరేణి కార్మికులందరికీ తెలిసిందేనన్నారు. కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, బోనస్ లు, లాభాల వాటా సాధించి పెట్టడంలో ఏఐటియుసి పోషించిన పాత్రను ఓర్వలేని కొన్ని సంఘాలు ఏఐటియుసి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంఘాల వైఖరిని కార్మికులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు 59,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం 2025-26లో సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, అందులో నుండి 40 శాతం వాటాను కార్మికులకు అందజేయాలన్నారు. దీపావళికి ముందు పిఎల్ఆర్ బోనస్, దసరాకు ముందు లాభాల వాటా ఇవ్వాలని, ఈ రెండు బకాయిలకు యాజమాన్యం, ప్రభుత్వాలు నిధులు సమకూర్చుకోవాలన్నారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, పనిముట్లు, భద్రతా సామగ్రిని వెంటనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో సంస్థ నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జెన్కో, ట్రాన్స్ కో నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 9న హైదరాబాద్ లోని జెన్కో ప్రధాన కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణి కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని, సంస్థకు రావాల్సిన బకాయిలను సాధించడంతో పాటు సింగరేణి సంస్థను మరింత లాభాల బాటలో నడిపించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ ఆర్థిక పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటియుసి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, ఎగేటి రాజేశ్వరరావు, కల్వల శ్రీనివాస్, పారిపెల్లి సంజీవ్ కుమార్, సృజన గీతిక, బ్రాంచ్ నాయకులు సోమిశెట్టి రాజేశం, గోపతి సత్యనారాయణ, పెద్దపెల్లి బానయ్య, ములకలపల్లి వెంకటేశ్వర్లు, సివి రమణ, పిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ప్రేమ్ లాల్, జి రాంబాబు, బి రామన్న, సాదుల సంపత్, జువ్వాది శ్రీనివాస్, ముద్దసాని కోటయ్య, మల్లేష్, తోట శ్రీనివాస్, సాధన వీణ ప్రభాకర్, డ్రైవర్ కుమారస్వామి, కన్నం వేణు, బైరి పోశాలు, ఊరకొండ శ్రీకాంత్, పున్నం శ్రీనివాస్, హేమచంద్ర, శెట్టి రాజేందర్, రామ్ రెడ్డి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్స్ విక్రమ్ సింగ్, తోట వెంకటస్వామి లు పాల్గొన్నారు.