జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 09 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామంలో శ్రీ నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ‘దుర్గా ఆగమనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డిని ఉత్సవ కమిటీ నిర్వాహకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ సారి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే దుర్గా ఆగమనం వేడుకలో గోపాల్ రెడ్డి పాల్గొని ఉత్సవాలను ప్రారంభించాలని కోరారు. ఈ ఆహ్వానంపై స్పందించిన మద్దుల గోపాల్ రెడ్డి.. అమ్మవారి ఉత్సవాల ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరిస్తూ, తప్పకుండా కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిపారవశ్యంతో జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిషన్, శ్రీధర్, రాజు రెడ్డి, రేవంత్, అరవింద్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.