prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 3:41 pm Digital Edition : PRAJA VANI

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ పురుషోత్తం
పరిగి , అక్టోబర్ 14( ప్రజావాణి)
పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కుల్కచర్ల తహసీల్దార్ పురుషోత్తం కోరారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన పట్టభద్రులు ఓటరు ఫారం-18 (Form-18) ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, లేదా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
జతచేయాల్సిన పత్రాలు.. దరఖాస్తుతో పాటు డిగ్రీ ఒరిజినల్/ప్రొవిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన సర్టిఫికెట్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.
సాధారణ ఎన్నికల ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రత్యేకంగా పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. నిర్దేశిత గడువు ముగిసేలోగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని ఎమ్మార్వో కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.