prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 6:48 pm Digital Edition : PRAJA VANI

నోముల గ్రామంలో పొలంబడి కార్యక్రమం

*నోముల గ్రామంలో పొలంబడి కార్యక్రమం*

*రైతులకు వ్యవసాయ మెలకువలపై అవగాహన కల్పించిన అధికారులు*

*రైతులే శాస్త్రవేత్తలుగా మారాలి: ఇబ్రహీంపట్నం ఏడీఏ శశిధర్ రెడ్డి*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 23 (ప్రజావాణి):మంచాల మండలం నోముల గ్రామ పరిధిలో పొలంబడి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏడీఏ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు సమగ్ర వ్యవసాయ మెలకువలను పాటించాలని, రైతులే శాస్త్రవేత్తలుగా మారాలని సూచించారు.

ప్రతి రైతు తన పొలానికి వెళ్లినప్పుడు పంటను నిశితంగా పరిశీలించాలని, పోషక లోపాలు, పురుగుల వల్ల కలిగే నష్టాలను గుర్తించాలని తెలిపారు. పంటలకు తెగుళ్లు కలిగించే కారకాలను ముందుగానే గుర్తించి, తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రస్తుతం వరి పంట గింజ పాలు పోసుకునే దశ నుంచి కోత దశ వరకు ఉందని తెలిపారు. ఈ దశలో కంకినల్లి, సుడిదోమ, అగ్గితెగులు వంటి సమస్యల లక్షణాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రైతులకు వివరించారు. తెగుళ్ల నివారణలో విత్తనశుద్ధి ఎంతో ముఖ్యమని, విత్తనాలను ఎంపిక చేసుకునే సమయంలో ప్రతి రైతు తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలని కోరారు.

పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా జిల్లాలోని ఏ సీసీఐ కొనుగోలు కేంద్రంలోనైనా విక్రయానికి సమయాన్ని నమోదు చేసుకొని పత్తిని అమ్ముకోవచ్చని తెలిపారు.

రబీ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులందరూ తప్పనిసరిగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకొని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి సిరి, తదితరులు పాల్గొన్నారు.