prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 7:02 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తున్న హంగర్గ గ్రామ కార్యదర్శి.

నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తున్న హంగర్గ గ్రామ కార్యదర్శి.

పాలకవర్గాన్ని సైతం లెక్కచేయని పంచాయతీ కార్యదర్శి.

పంచాయతీ కార్యదర్శి తీరుపై తిరగబడ్డ పాలకవర్గం, గ్రామస్థులు.

ఆగ్రహంతో కార్యదర్శి నిర్బంధం,పంచాయతీ కార్యాలయానికి తాళం.

రికార్డుల స్వాధీనం డిఎల్పిఓ విచారణకు గ్రామస్థుల డిమాండ్.

కోటగిరి (ప్రజావాణి):-పోతంగల్ మండల పరిధిలోని హంగర్గ గ్రామ పంచాయతీలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తూ పాలక వర్గ తీర్మానాలు,నిర్ణయాలను ఖాతరు చేయకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శి గంగారాంపై గ్రామస్థులు,ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యదర్శిని పంచాయతీ కార్యాలయంలోనే నిర్బంధించి కార్యాలయానికి తాళం వేసి బైఠాయించారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టత ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీరడి ఉదయ్ భాస్కర్, ఉపసర్పంచ్ డి గోపాల్,పాలకవర్గ సభ్యులు,గ్రామస్థులు మాట్లాడుతూ.కార్యదర్శి తీరుపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు.గ్రామసభలో జమా ఖర్చుల వివరాలు చూపించకుండా ప్రశ్నించిన వారికి సమాధానాలు దాటవేస్తున్నారని మండిపడ్డారు.ఎలాంటి రశీదులు ఇవ్వకుండా ప్రతి సర్టిఫికేట్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని.ఇంటి నంబర్ పేరు మార్పిడి కోసం బిల్లులు లేకుండానే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటు న్నారని వాపోయారు.పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఇంటి నంబర్లు కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.రశీదు పుస్తకాల్లో ఖాళీలు వదు లుతూ నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారని.వసూలైన పన్ను ల్లో రూ.40 వేల నుండి రూ.50 వేల వరకు బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారని వెల్లడించారు.జన వరి నెలలో ఒక్క రోజే ఎన్నికల ఖర్చుల పేరిట రూ.39,000, రూ.24,000,రూ.20,000 లతో పాటు ఎంబీ నమోదు కోసం రూ.32,000 చూపి అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఈ ఆందోళన విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు.మండల ఉన్నతాధికారు లు శిక్షణలో ఉండటంతో మండల పంచాయతీ కార్యదర్శు ల సంఘం ప్రతినిధులను అక్కడికి పంపించారు.అనంతరం సర్పంచ్,మండల సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్ సింధె షాజీ పాటిల్,ఉపసర్పంచ్ డి.గోపాల్,మండల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో సుదీర్ఘంగా చర్చించారు.అందరి సమక్షంలో కార్యదర్శి వద్ద ఉన్న గ్రామ పంచాయతీ రికార్డులు, లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కార్యదర్శిపై డివిజనల్ పంచాయతీ అధికారి చేత విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని పాలకవర్గం, గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.