నెల్లికుదురులో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం..
భూమి పూజ చేసిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి..
అరగంటలో ఉన్నత చదువుకు చేరేందుకు ప్రణాళికలు..
అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు..
రాజ్యసభ సభ్యులు వేం ..
ప్రజావాణి,నెల్లికుదురు: అరగంట ప్రయాణానికే విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి చేరే విధంగా సంబంధిత ఉన్నత కళాశాలలు అందుబాటులోకి తీసుకు రావడానికి విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.7 కోట్ల 50 లక్షలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం లోని విద్యాలయాల సముదాయం ఆవరణంలో స్థానిక ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్,ఎంపీ బలరాం నాయక్,డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్,కలెక్టర్ స్నేహబరీష్,మానుకోట మున్సిపల్ చైర్మన్ జ్యోతి, గ్రంథాలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,ఇన్చార్జి డీఈవో అనిల్ కుమార్ లతో కలిసి శుక్రవారం వేం నరేందర్ రెడ్డి భూమి పూజ చేశారు.అభివృద్ధి పనుల శంకు స్థాపనకు వేం నెల్లికుదురుకు రాగా మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచుల,పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం 122 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మొట్టమొదట నెల్లికుదురులో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు.జూన్ మొదటి వారం వరకు పనులు పూర్తి చేసి పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మండలానికి కో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతులలో ఉన్న దృష్ట్యా విద్యా వ్యవస్థకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు
నెల్లికుదురు చారిత్రక శ్రీ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేయనున్నట్లు వేం ప్రకటించారు.అంతకుమునుపు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. పరిసరాలను పరిశీలించారు.స్థానిక నాయకులు అభ్యర్థన మేరకు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల కు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం,విశిష్టత అత్యంత ప్రసిద్ధి చెందినదిగా ఉందన్నారు.
విశ్రాంతి భవన పనుల పరిశీలన..
స్థానిక విశ్రాంతి భవనాన నిర్మాణ పనులను నరేందర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఆధునిక హంగు లతో గెస్ట్ హౌస్ నిర్మాణానికి అదనపు నిధులు విడుదల చేయడానికి కృషి చేయనున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు.
పిహెచ్సి ఉన్నతీకరణ డయాలసిస్ కేంద్రానికి కృషి..
స్థానిక పీహెచ్సీ ని 30 పడకల కు పెంచుతూ ఉన్నతీకరించ నున్నట్లు వేం చెప్పారు. పలువురి అభ్యర్థన మేరకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటును పరిశీలించనున్నట్లు నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
బస్టాండ్ కోసం స్థలం కేటాయించాలి..
నెల్లికుదురులోని ప్రస్తుత బస్టాండు చిన్నగా ఉందని,కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయడానికి ఒక ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయించాలని రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు సూచించారు. స్థలం గుర్తించిన వెంటనే బస్టాండ్ ఏర్పాటుకు నిధులు కేటాయించేలా కృషి చేస్తామన్నారు. నెల్లికుదురు లో డివైడర్లు,సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు..
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివన్నారు. ప్రజా సంక్షేమం కోసం సన్న బియ్యం, మహిళలకు ఫ్రీ బస్సు, గృహాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల మంజూ రి, ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు, రైతులకు వ్యవసాయ పరికరాలు,రుణమాఫీ వంటి ఎన్నో పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.అదే సమయంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు,పబ్లిక్ స్కూల్స్ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్ల అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. జిల్లా కేంద్రం మహబూబాబాద్ తో పాటు కేసముద్రం, నెల్లికుదురు,ఇనుగుర్తి తదితర ప్రాంతాలలో విద్యాసంస్థలు ఏటిసి ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రైతులు సహకరించాలి..
మునుపెన్నడు లేనివిధంగా ఎల్ నినో ప్రభావం ఉండడంతో సాగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని వేం నరేందర్ రెడ్డి కర్షకులను కోరారు. గత రెండు సంవత్సరాలుగా పంటలు బాగా పండించుకున్నామని ఈసారి రైతులు నీటి ఆధారిత పంటలు కాకుండా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు.
అంతకు మునుపు స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్,ఎంపీ బలరాం నాయక్,ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్, సర్పంచి పులి వెంకన్న తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో కేసంద్రం ఏ ఎస్ సి చైర్మన్ సంజీవరెడ్డి,తహసిల్దార్ చంద నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్,ఎంఈఓ రాందాస్, వివిధ శాఖల అధికారులు డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి, భరత్ చందర్ రెడ్డి, జిజేసి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరస్వామి, ఉపేందర్ రావు, హై స్కూల్ హెచ్ ఎం లు జలగం శ్రీనివాస్,వాణిశ్రీ, వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.