prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 4:40 pm Digital Edition : PRAJA VANI

నెర్రలు పారిన పొలాల్లో బీఆర్ఎస్ ప్రెస్‌మీట్

నెర్రలు పారిన పొలాల్లో బీఆర్ఎస్ ప్రెస్‌మీట్
రైతులకు సాగునీరు అందించాలి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్
దండేపల్లి, అక్టోబర్ 27 (మండల్ ప్రజావాణి): మంచిర్యాల నియోజకవర్గంలోని పలు మండలాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షెట్టిపేట మండలం బలరావుపేట గ్రామంలో నెర్రలు పారిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం పొలాల్లోనే ప్రెస్‌మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెండా వెంకటాపూర్, బలరావుపేట, పెద్దంపేట గ్రామాలతో పాటు హాజీపూర్ మండలంలో సాగునీరు అందక సుమారు 80 శాతం పొలాలు ఎండిపోయాయని తెలిపారు. పంట పొలాలు నెర్రలు పారే పరిస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ముందస్తు చర్యలు తీసుకొని సాగునీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రైతులకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.
కడెం, గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించాలి
కడెం ప్రాజెక్టుతో పాటు గూడెం లిఫ్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విజిత్ కుమార్ ఆరోపించారు. రైతుల పంటలను కాపాడేందుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి రైతులకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు.
కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు నీరు తరలిపోతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పలుమార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రైతులను పంటలు వేయొద్దనడం సరికాదు
సాగునీరు అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పంటలు వేయొద్దని సూచించడం సరికాదని విజిత్ కుమార్ అన్నారు. ఆరు నెలల పాటు పంటలు వేయొద్దని చెబుతున్నప్పుడు వ్యవసాయ శాఖ, వ్యవసాయ అధికారుల అవసరం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు ఆరు గంటలే విద్యుత్ అందిస్తోందని ఆరోపించారు. గూడెం లిఫ్ట్ మోటార్లను ముందుగానే ప్రారంభించి, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని నింపి ఉంటే మంచిర్యాల నియోజకవర్గంలో వేల ఎకరాల పంటలు ఎండిపోయేవి కావని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి
మంచిర్యాల ఎమ్మెల్యే వ్యక్తిగత వివాదాలను పక్కనపెట్టి ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విజిత్ కుమార్ సూచించారు. కనీసం 15 రోజుల ముందుగానే సాగునీరు విడుదల చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. వ్యక్తిగత వివాదాలకు కేటాయించే సమయంలో కొంతైనా రైతుల సమస్యల పరిష్కారానికి కేటాయించాలని కోరారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని రైతాంగానికి తక్షణమే సాగునీరు అందించి, మిగిలిన పంటలైనా ఎండిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొనరు