prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 5:33 pm Digital Edition : PRAJA VANI

నూతన డిప్యూటీ తహసీల్దార్‌కు ఎమ్మార్పీఎస్ నాయకుల శుభాకాంక్షలు

నూతన డిప్యూటీ తహసీల్దార్‌కు ఎమ్మార్పీఎస్ నాయకుల శుభాకాంక్షలు

హసన్‌పర్తి మండలంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నూతన కమిటీల పునర్నిర్మాణానికి శ్రీకారం

మన ప్రజవాణి,హసన్‌పర్తి,27:

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆరెపల్లి సుమన్‌ను ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌–ఎంఎస్పీ జాతీయ నాయకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి పుట్ట రవి మాదిగ, మంద కొర్నేలు మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు, హనుమకొండ జిల్లా నూతన దామెర మండల ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి ఆరెపల్లి పవన్ మాదిగ, హనుమకొండ జిల్లా మహాజన సోషలిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, హసన్‌పర్తి ఎమ్మార్పీఎస్‌ కో-ఇన్‌చార్జి రాజారపు బిక్షపతి మాదిగ, ఎంఎస్పీ జిల్లా నాయకులు మేకల రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగ, హసన్‌పర్తి మండల మహాజన సోషలిస్టు పార్టీ నూతన అధ్యక్షుడు ఆకారపు రాజు మాదిగ, తోట శ్రీకాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థాయి నుంచి ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ కమిటీల పునర్నిర్మాణం

అనంతరం హసన్‌పర్తి మండలంలోని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ, ఎంఎంఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ (మాదిగ విద్యార్థి ఫెడరేషన్‌) సంఘాల జిల్లా, మండల, గ్రామస్థాయి నూతన కమిటీలను ఏర్పాటు చేసి, సంఘాలను మరింత బలోపేతం చేయాలని నాయకులు నిర్ణయించారు. సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

రిజర్వేషన్ల ఫలాలు విద్యార్థులకు అందాలి

మాదిగ జాతి హక్కుల సాధన కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 32 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేశారని నాయకులు పేర్కొన్నారు. ఆ పోరాటంలో అమరులైన వారి త్యాగాల ఫలితంగా సాధించుకున్న రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం సాధించిన 9 శాతం రిజర్వేషన్ల ప్రయోజనాలు మాదిగ పల్లెల్లోని విద్యార్థులకు అందేలా కృషి చేయాలని అన్నారు.

మాదిగ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి విద్యా, ఉద్యోగ రంగాల్లో ముందంజలో నిలవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలను గుర్తించి, వారికి విద్య అందేలా సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశయాలను విద్య ద్వారా నెరవేర్చడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు.

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

మాదిగ వాడల్లోని యువత, విద్యార్థులు మద్యపానం, ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సంఘాల కమిటీలను పునర్నిర్మించి, విద్యార్థుల అభ్యున్నతి, సామాజిక చైతన్యం, జాతి హక్కుల పరిరక్షణ కోసం సమష్టిగా పనిచేయాలని తెలిపారు.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ, ఎంఎంఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ సంఘాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ, మాదిగ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.