నిరుపేద కుటుంబానికి ప్రెస్‌క్లబ్ ఆసరా..
• అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి నిత్యావసరాల అందజేత..
కోదాడ టౌన్, అక్టోబర్ 9/ ప్రజావాణి
అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉపాధి కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి కోదాడ ప్రెస్‌క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. పట్టణంలోని నయానగర్ 15వ వార్డుకు చెందిన షేక్ మన్నాన్ కాళ్లకు గాయాలై, ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పనులకు వెళ్లలేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న ఆయన దీనస్థితిని తెలుసుకున్న ప్రెస్‌క్లబ్ సభ్యులు స్పందించారు.
స్థానిక దాతలు కాసారపు కృష్ణ (చందు మొబైల్స్), ఎం.డీ. రహీమ్, షేక్ నూరుద్దీన్ సహకారంతో సేకరించిన నిత్యావసర సరుకులను శుక్రవారం బాధితుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కష్టాల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తూ మానవతా విలువలను పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి, గౌరవ సలహాదారు వీరాంజనేయులు, సభ్యులు బానాల అబ్రహాం, జగన్ మోహన్ రావు, నూరుద్దీన్, ఉపేందర్, జి. మోహన్, వెంకటేశ్వరులు, గోపీచంద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.