prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:35 pm Digital Edition : PRAJA VANI

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం

-అక్టోబర్ 9న భూపాలపల్లిలో మెగా జాబ్‌మేల

*భూపాలపల్లి,అక్టోబర్1(మన ప్రజావాణి )*
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అక్టోబర్ 9న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో మెగా జాబ్‌మేళా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం ఐడీఓసీలో జాబ్‌మేళా ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతి రాజ్, డిఆర్డీఓ సింగరేణి, జెన్కో, తదితర శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాబ్‌మేళాలో 300కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, 20 వేల మంది నిరుద్యోగ యువతను సమీకరించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై జాబ్‌మేళాను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఎంపీ కడియం కావ్యతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. జాబ్ మేళా నిర్వహణ సమాచారం ప్రతి గ్రామానికి చేరాలని గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువతను గుర్తించి జాబ్‌మేళాకు వచ్చేలా చూడాలని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అక్టోబర్ 6 లోగా గ్రామాల వారీగా చదువుకున్న నిరుద్యోగ యువత వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే నిరుద్యోగ యువతకు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జాబ్‌మేళా ప్రాంగణంలో మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపారు. తక్కువ వ్యవధి ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు చేపడుతున్న జాబ్‌మేళాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

గతంలో నిర్వహించిన, జాబ్‌మేళాలో 10 వేలకు పైగా యువత పాల్గొనగా, సుమారు 2,770 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈసారి కూడా సింగరేణి, జెన్కో యాజమాన్యాలు, టాస్క్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులకు మేళా ప్రాంగణంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నట్లు వివరించారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్హతలు ప్రామాణికంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని సూచించారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, డిఆర్డీఓ బాలకృష్ణ, సింగరేణి జిఎం రాజేశ్వర రెడ్డి, జన్కో ఎస్ ఈ ముత్యాల రావు తదితరులు పాల్గొన్నారు.