prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 10:13 am Digital Edition : PRAJA VANI

నాలుగున్నరేళ్లుగా ఎదురుచూపులేనా

నాలుగున్నరేళ్లుగా ఎదురుచూపులేనా?

హసన్‌పర్తి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమి ఎక్కడ?

ప్రభుత్వ భూమి కేటాయింపులో జాప్యం.. విద్యుత్ సమస్యలతో ప్రజలు, వ్యాపారుల ఇక్కట్లు!

8 వేలకుపైగా విద్యుత్ కనెక్షన్లు.. 300 ట్రాన్స్‌ఫార్మర్లు.. అయినా సబ్‌స్టేషన్ నిర్మాణానికి నోచుకోని వైనం

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం.. సబ్‌స్టేషన్ నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్

హసన్‌పర్తి, అక్టోబర్ 12 (మన ప్రజావాణి):

హసన్‌పర్తి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంజూరైన సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని వెంటనే కేటాయించాలని ప్రజలు, రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. సుమారు నాలుగున్నరేళ్లుగా సబ్‌స్టేషన్ నిర్మాణం పెండింగ్‌లో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మండల కేంద్రంలో 8 వేలకుపైగా గృహ, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు, దాదాపు 300 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటంతో విద్యుత్ వినియోగం అధికంగా ఉందని తెలిపారు. తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురవడం, ఫ్యూజులు పోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సబ్‌స్టేషన్‌కు అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కేటాయించడంతో పాటు, విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను కూడా పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు దాడి శ్రీకాంత్ యాదవ్, గౌరిశెట్టి కృష్ణమూర్తి, హరీష్, పాఠశాలల కరస్పాండెంట్లు, రైతులు మారపల్లి రామచంద్రారెడ్డి, వీసం కరుణాకర్ రెడ్డి, మారేపల్లి జైపాల్ రెడ్డి, వల్లాల గణేష్, తలకొక్కుల ఐలయ్య, జన్ను సురేష్, వేల్పుల రామయ్య, తోట చిన్న సారంగం తదితరులు పాల్గొన్నారు.