prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:08 pm Digital Edition : PRAJA VANI

నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

*నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి*

*వలసలను నివారించి ఎన్నికల హామీలను అమలు చేయాలి*

*ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ చిరంజీవి*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 11 సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి*

సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలు, తండాల్లో ప్రజలు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి లభించకపోవడంతో కుటుంబాలను వదిలి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల అభివృద్ధిపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులకు కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాధి వంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే జీవనోపాధి పొందేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, నియోజకవర్గ అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మణ్ సోహెల్ రహీం తదితరులు పాల్గొన్నారు