నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందన
ప్రజావాణి – మిర్యాలగూడ నియోజకవర్గం | అక్టోబర్ 12
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మాజీ మంత్రి జానారెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసింది.
ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులు, ఎండిపోతున్న పంటలను కాపాడాల్సిన అవసరం, ప్రజల తాగునీటి అవసరాలను ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారు. అనంతరం రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌పీ అధికారులు సోమవారం నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి వెసులుబాటు కలగడంతో పాటు స్థానిక ప్రజల తాగునీటి అవసరాలకు ఉపశమనం లభించనుంది. నీటి విడుదలపై రైతులు, ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ఐదో వార్డు ఇన్‌చార్జి కేతావత్ జవహర్ నాయక్, ఓబీసీ సెల్ జిల్లా నాయకుడు ప్రవీణ్, మిర్యాలగూడ మండల ఆత్మ (ATMA) చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.