నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా
వర్గీకరణలో నేతకానీలకు జరిగిన అన్యాయంపై పోరుబాట!
నవంబర్ 15న ‘హలో నేతకాని – చలో ఉస్మానియా’
సాయిని ప్రసాద్ నేత
దండేపల్లి, అక్టోబర్ 23 (ప్రజావాణి):
ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి అన్యాయం జరిగిందని నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ‘హలో నేతకాని – చలో ఉస్మానియా’ కార్యక్రమ కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత అన్నారు. నేతకాని సమాజానికి న్యాయం జరిగే వరకు ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 15న రాష్ట్రస్థాయిలో ‘హలో నేతకాని – చలో ఉస్మానియా’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా దండేపల్లి మండల కేంద్రంలో నేతకాని కుల సంఘం మండల అధ్యక్షుడు జాడి రాజన్న, దూట సాయికుమార్ నేతృత్వంలో నిర్వహించిన మండలస్థాయి సన్నాహక సమావేశానికి సాయిని ప్రసాద్ నేత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి జరిగిన నష్టాన్ని ఆయన వివరించారు. ప్రభుత్వాలు స్పందించి నేతకాని సమాజానికి న్యాయం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడతామని, సమాజాన్ని చైతన్యపరిచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. నేతకాని హక్కుల సాధన కోసం భవిష్యత్తులో చేపట్టే ఉద్యమాలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వర్గీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేతకాని సంఘం
2002లో ఎస్సీ కులాల వర్గీకరణను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు గ్రూపులుగా విభజించగా, 2024లో చేపట్టిన వర్గీకరణలో ఒకటి, రెండు, మూడు గ్రూపులుగా ఎందుకు విభజించారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సాయిని ప్రసాద్ నేత ప్రశ్నించారు. వర్గీకరణకు సంబంధించిన పలు అంశాలను నవంబర్ 15న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి దండేపల్లి మండలంలోని నేతకాని కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా సమాజంలో మరింత చైతన్యం తీసుకువచ్చి, భవిష్యత్తు ఉద్యమాలకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కార్యక్రమ వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాస్, కో-కన్వీనర్ జాడి గంగాధర్, దండేపల్లి మండల నేతకాని సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.