ధర్మగడ్డ తండాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, ధర్మగడ్డ తండా గ్రామ పంచాయతీ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి మూడ చందన దేవేందర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అనంతరం తండాలోని వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మూడ చందన దేవేందర్ ఎమ్మెల్యేకు అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ధర్మగడ్డ తండాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ లో చేరిన వారిలో వార్డు సభ్యుడు భూక్య బికినీ, భూక్య శ్రీనివాస్, భూక్య సోమ్లా, బానోత్ శ్రీనివాస్, మూడ మహేష్, మూడ మనోజ్ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేష్, కాంగ్రెస్ నాయకులు నల్ల యాదగిరి, పంగ ఐలయ్య, కున్సోత్ లక్ష్మణ్, మూడ జగురామ్, పంగ వెంకన్న, కాసర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.