prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 8:27 am Digital Edition : PRAJA VANI

దోపిడీ ముఠా దౌర్జన్యం.. దాడులతో బీభత్సం

దోపిడీ ముఠా దౌర్జన్యం.. దాడులతో బీభత్సం!

– ఇద్దరిని చితకబాది బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌, పర్సు దోపిడీ

– బలవంతంగా డబ్బులు చెల్లింపజేసి బీరు, పెట్రోల్ కొనుగోలు

– బీరు సీసాతో తలపై దాడి.. ఐదుగురి ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు

– నిందితుల్లో ఇద్దరు బాలలు.. చోరీ సొత్తు స్వాధీనం

పటాన్‌చెరు, అక్టోబర్ 28 (ప్రజావాణి): పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ ముఠా దౌర్జన్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌, పర్సు లాక్కోవడమే కాకుండా బలవంతంగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లింపజేసి బీరు, పెట్రోల్ కొనుగోలు చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 25న సాయంత్రం 4.30 గంటల సమయంలో సైకత్ రాయ్, అతని పరిచయస్తుడు షేక్ హనీఫ్ బాషా ఇంద్రేశం గ్రామంలోని త్రిశూల్ వైన్స్ సమీపంలో కూర్చుని ఉండగా ఐదుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి గొడవకు దిగారు. ప్లాస్టిక్ పైపుతో దాడి చేసి బెదిరించి వారి వద్ద ఉన్న సుమారు 10 గ్రాముల బంగారు గొలుసు, రెడ్‌మి సెల్‌ఫోన్‌, పర్సును బలవంతంగా లాక్కున్నారు. అంతటితో ఆగకుండా బాధితులతో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లింపజేసి బీరు, పెట్రోల్ కొనుగోలు చేయించారు. అనంతరం వారిని సుల్తాన్‌పూర్ వైపు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో షేక్ హనీఫ్ బాషా తలపై బీరు సీసాతో కొట్టడంతో గాయమైంది. తర్వాత బాధితులను ముత్తంగి సమీపంలోని ప్యాలెస్-2 రెస్టారెంట్ వద్దకు తీసుకురాగా, సైకత్ రాయ్ సహాయం కోసం కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు క్రైమ్ నంబర్ 1418/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పటాన్‌చెరు ముదిరాజ్ బస్తీకి చెందిన షేక్ జహంగీర్ (35), ఇంద్రేశం సాయి కాలనీకి చెందిన మ్యాదరి ఆనంద్ (25), కిష్టారెడ్డిపేటకు చెందిన ఉమర్ ఫారూఖ్ (18)తో పాటు మరో ఇద్దరు బాలల ప్రమేయాన్ని గుర్తించారు. బుధవారం దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి బంగారు గొలుసు, రెడ్‌మి సెల్‌ఫోన్‌, నల్లరంగు పర్సును స్వాధీనం చేసుకున్నారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పటాన్‌చెరు పోలీసులు వెల్లడించారు.