prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 9:06 am Digital Edition : PRAJA VANI

దసరా సెలవులను ఆనందంగా గడపండి ప్రమాదాలకు దూరంగా ఉండండి

దసరా సెలవులను ఆనందంగా గడపండి ప్రమాదాలకు దూరంగా ఉండండి.

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 13.

ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ సూచనల తెలియజేశారు.

దసరా సెలవులను విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు ఆనందంగా సురక్షితంగా గడపాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ సూచించారు. సెలవుల సమయంలో సరదాగా గడిపే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

దసరా సెలవుల నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల శివార్లలోని చెరువులు, బావులు, కాలువలు, ఇతర నీటి వనరుల వద్దకు పిల్లలు, యువకులు ఈత కోసం వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి లోతుపై అవగాహన లేకుండా నీటిలోకి దిగడం ప్రాణాపాయానికి దారితీయవచ్చని హెచ్చరించారు. ఈత రాని వారు ఇతరుల ఒత్తిడికి లోనై నీటిలోకి దిగవద్దని స్పష్టం చేశారు.

విద్యార్థులు సెలవుల సమయంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించే సమయంలో పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలని, అక్కడి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చని తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు

మైనర్లు (18 ఏళ్లలోపు వారు) సరదా కోసం ద్విచక్ర వాహనాలు లేదా ఇతర మోటారు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని ఎస్పీ హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే సంబంధిత వాహన యజమానులు, తల్లిదండ్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న చెరువులు, జలాశయాలు, కాలువలు, ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.

విద్యార్థులు, యువత తమ విలువైన ప్రాణాలను క్షణిక సరదా కోసం ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, తల్లిదండ్రులు, పోలీసుల సూచనలు పాటిస్తూ దసరా సెలవులను సురక్షితంగా, సంతోషంగా గడపాలని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., కోరారు.