దసరా అలాయ్ బలాయ్ కార్యక్రమం వాయిదా
త్వరలోనే అనుకున్న చోటే అలాయ్ బలాయ్ నిర్వహిస్తాం
• మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
ఆందోల్ నియోజకవర్గం
మన ప్రజావాణి అక్టోబర్ 22: అందోల్ / జిల్లా ప్రతినిధి
ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు రావడంలో జాప్యం కారణంగా శుక్రవారం జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
మునిపల్లి మండలం బుసిరెడ్డిపల్లి శివారు ప్రాంతంలో నిర్వహించాల్సిన దసరా అలాయ్ బలాయ్ రైతు సదస్సుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు కరువు, వ్యవసాయ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ కష్టకాలంలో రైతులకు భరోసా కల్పించి అండగా నిలవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అయితే, అనుమతుల పేరుతో పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను చర్చించి వారికి భరోసా కల్పించేందుకు నిర్వహించాలనుకున్న అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని త్వరలోనే అదే ప్రదేశంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులకు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వెంట మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి. జైపాల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు పి. నారాయణ ముదిరాజ్, డి.బి. నాగభూషణం, బీఆర్‌ఎస్ నాయకులు చాపల వెంకటేశం, అనిల్ రెడ్డి, బిర్ల శంకర్, తాజొద్దిన్, వెంకట్ గౌడ్ తదితరులు ఉన్నారు.