దర్శి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్ )15 దర్శి
ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ గురువారం దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలు,గాంధీనగర్ లోని ప్రాధమిక పాఠశాల, చింతలపాలెంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మరియు చెక్ పోస్ట్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు, రాకపోకల మార్గాలు, రూట్ మ్యాప్లు, స్ట్రాంగ్ రూమ్ల భద్రత తదితర అంశాలను జిల్లా ఎస్పీ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ క్రమంలో దర్శి మున్సిపల్ పరిధిలోని మూడు సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను సందర్శించి, ఒకే లొకేషన్ లో ఎక్కువ పోలింగ్ స్టేషన్లో ఉండటం, గతంలో జరిగిన సంఘటనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.
దర్శి మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు, 14 పోలింగ్ లొకేషన్లు, 51 పోలింగ్ స్టేషన్లు ఉండగా, సుమారు 29 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖకు, జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రత్యర్థి అభ్యర్థులు సహా పోటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి, ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రక్రియలో నిన్నటి నుంచి దర్శి మున్సిపల్ పరిధిలో మూడు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత నెల రోజులుగా విస్తృతంగా పల్లెనిద్ర కార్యక్రమాలు, పోలింగ్ స్టేషన్ల విజిట్,సమస్యాత్మక గ్రామాల పర్యటనలు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు పరచటం, రౌడీషీటర్లు( చెడు నడత గల వ్యక్తులు),ట్రబుల్ మాంగర్స్ ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు, దర్శి డిఎస్పీ బాల మురళీకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, దర్శి సీఐ నాగమల్లేశ్వర రావు, , దర్శి ఎస్సై ఏడుకొండలు మరియు సిబ్బంది ఉన్నారు.