తెలంగాణ రాబిన్ హుడ్ ‘పండగ సాయన్న’ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయం: కుల్కచర్ల ముదిరాజ్ సంఘం
పరిగి/కుల్కచర్ల,అక్టోబర్ 22(ప్రజావాణి )
పేదల ఆపద్బాంధవుడు, బ్రిటిష్ నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ‘తెలంగాణ రాబిన్ హుడ్’ పండగ సాయన్న 174వ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై కుల్కచర్ల మండల ముదిరాజ్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అయిన పండగ సాయన్న జయంతిని ప్రభుత్వ వేడుకగా నిర్వహించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇందుకు విశేష కృషి చేసిన పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
సాయన్న పోరాట పటిమను, సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం చొరవ చూపడం అభినందనీయమని కొనియాడారు. ముదిరాజ్ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడిన ప్రజా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ముదిరాజ్ సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మండల ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సోదరులు పాల్గొన్నారు.