తాళ్లపేటలో దాడి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు
దాడిలో ముగ్గురికి గాయాలు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
దండేపల్లి, అక్టోబర్ 21 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపేట గ్రామానికి చెందిన పేరం రజిత (40), తన సోదరుడు ఆకుల రాజేంద్ర ప్రసాద్, మేనల్లుడు ఆకుల అకిరానందన్తో కలిసి జమ్మికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారి పొరుగువారైన ఆకుల కిరణ్, ఆకుల రాజేందర్, ఆకుల సురేష్, ఆకుల విజయ్ వర్ధన్, ముట్టె కుమారస్వామి, ఎర్రం మల్లేష్లు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలతో, చేతులతో దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఈ దాడిలో ఆకుల రాజేంద్ర ప్రసాద్, ఆకుల అకిరానందన్ల తలలకు గాయాలు కాగా, పేరం రజిత చేతికి గాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, నిందితులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దండేపల్లి పోలీసులు ఆకుల కిరణ్, ఆకుల సురేష్, ఆకుల విజయ్ వర్ధన్లను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.