తప్పుడు రిపోర్ట్, పెంచి చూపించే గణాంకాలకు తావివ్వకూడదు…!
విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో వాస్తవ మార్పు తీసుకురావాలని సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి విద్యా శాఖకు సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది మండల విద్యాధికారుల పనితీరు అత్యంత నిరాశాజనకంగా ఉందని, పనితీరులో తక్షణమే మార్పు రావాలని, పనితీరు మెరుగు పడని పక్షంలో బాధ్యతల నుంచి తప్పించి సమర్థవంతంగా పనిచేసే ఇతరులకు అవకాశం కల్పించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
మండల విద్యా శాఖాధికారులు తమ పరిధిలోని క్లస్టర్ హెడ్‌మాస్టర్లు, ప్రధానోపాధ్యాయుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. తాను అధికారులకు అవసరమైన వనరులు, సౌకర్యాలు కల్పించగలనని, అయితే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
క్లస్టర్ హెడ్‌మాస్టర్లు క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎఫ్.ఎల్.ఎన్. అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండల, క్లస్టర్ స్థాయిలో నిర్వహించే సమీక్ష సమావేశాలను కేవలం సాధారణంగా కాకుండా నాణ్యతతో నిర్వహించాలన్నారు.
ఏ సబ్జెక్టులో ఎఫ్.ఎల్.ఎన్. అభ్యసన సామర్థ్యం వెనుకబడి ఉంది, విద్యార్థుల సమస్యలను అధిగమించేందుకు ఇచ్చిన సూచనలు అమలు చేస్తున్నారా, ఇంకా మెరుగైన బోధనా విధానాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను మండల, క్లస్టర్ స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు.
నిపుణుల బృందాలు పాఠశాలలను సందర్శించి ఇచ్చే సూచనలను తప్పని సరిగా అమలు చేయాలని, నిపుణుల బృందాల ఫీడ్‌బ్యాక్‌ను క్లస్టర్ హెడ్‌మాస్టర్లకు కూడా అందించాలని తెలిపారు. వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, దృష్టి పెట్టాలని సూచించారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం విద్యా రంగంపై అత్యంత సీరియస్‌గా దృష్టి సారిస్తోందని తెలిపారు. క్లస్టర్ హెడ్‌మాస్టర్లు క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురాగల కీలక వ్యక్తులని, వారు తమ పరిధిలోని పాఠశాలల పనితీరును మెరుగుపరిచేలా పనిచేయాలని ఆదేశించారు.
తదుపరి సమీక్షా సమావేశానికి ప్రతి క్లస్టర్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో క్లస్టర్ హెడ్ మాస్టర్ వారీగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి పాఠశాల వారీగా ఎఫ్.ఎల్.ఎన్. అమలుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాఠశాల స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో, మండల స్థాయిలో సమీక్ష నిర్వహించేందుకు ప్రామాణికమైన ప్రత్యేక ఫార్మాట్లను సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతి పాఠశాలలో విద్యార్థుల అభ్యసన స్థాయి, ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, తీసుకుంటున్న చర్యలు, సాధిస్తున్న పురోగతి తదితర అంశాలను నిరంతరం నమోదు చేసి సమీక్షించాలని తెలిపారు.
విద్యా ఫలితాల్లో తెలంగాణ మరింత మెరుగైన స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ విద్యా ఫలితాల్లో 17వ స్థానంలో ఉందని, తెలంగాణ వంటి రాష్ట్రానికి ఈ స్థానం సరిపోదని పేర్కొన్నారు.
ఎఫ్.ఎల్.ఎన్. లో కొన్ని అంశాల్లో 9 శాతం, 6 శాతం సామర్థ్య ఫలితాలు రావడం తగదని అన్నారు. ఇకపై ప్రతి నెలా విద్యార్థుల సామర్థ్యంలో వాస్తవమైన పురోగతి కనిపించాలని ఆదేశించారు.
గణాంకాలను పెంచి చూపించడం, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా తప్పుడు సంఖ్యలు చూపించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ డేటా ఉండాలి.. అదే సమయంలో ప్రతి నెలా ఆ డేటాలో పురోగతి కనిపించాలి అన్నారు.
విద్యా సంవత్సరం ముగిసే నాటికి కనీసం 80 శాతం మంది విద్యార్థులు నిర్దేశిత ఎఫ్.ఎల్.ఎన్. సామర్థ్యాలను సాధించేలా ప్రతి ఉపాధ్యాయుడు పక్కా ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
క్షేత్రస్థాయి పర్యటనల్లో కొన్ని పాఠశాలల్లో ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా శిక్షణా కార్యక్రమాల అమలు అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కొన్ని పాఠశాలల్లో సంబంధిత శిక్షణా సామగ్రిని కనీసం ప్రారంభించలేదని, కొంతమంది సిబ్బందికి కూడా వాటి అమలుపై పూర్తి అవగాహన లేదని అన్నారు.
విద్యార్థులు కేవలం రెండు వ్యాయామాలు మాత్రమే పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మండల విద్యా శాఖాధికారులు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించి కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలన్నారు.
పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసేందుకు నెల రోజుల క్రితమే నిధులు విడుదల చేసినప్పటికీ, కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయకపోవడం ఏంటని జిల్లా కలెక్టర్ అన్నారు.
జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, విడుదలైన నిధులను ఏ విధంగా వినియోగించారు అనే పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
పిఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులను పూర్తిస్థాయిలో సక్రమంగా వినియోగిస్తే భవిష్యత్తులో అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. నిధుల వినియోగం సక్రమంగా లేకపోతే అదనపు నిధులు ఎలా కోరగలమని ప్రశ్నించారు. ఇతర జిల్లాల్లో పిఎం శ్రీ నిధుల వినియోగం 100 శాతం పూర్తయినప్పుడు ఖమ్మం జిల్లాలో ఎందుకు ఆశించిన స్థాయిలో పురోగతి లేదో అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు.
పిఎం శ్రీ పాఠశాలల్లో మౌళిక వసతులు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా నిధులను సక్రమంగా వినియోగించాలని, తద్వారా వచ్చే విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పిఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై ఎం. ఈ ఓ లు, ప్రధానోపాధ్యాయులు తదుపరి సమీక్షకు పి పి టి రూపంలో పూర్తి వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిధులతో సృష్టించిన ఆస్తులు, నిధులను ఏ విధంగా వినియోగించారు, విద్యార్థుల నమోదు ఎంత మేర పెరిగింది అనే వివరాలను పిపిటిలో పొందుపరచాలని సూచించారు.
ఎంఈఓ లు,, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు పిఎం శ్రీ పాఠశాలలను ప్రత్యేకంగా సందర్శించి, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలన్నారు.
కొన్ని మండలాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు చాలా తక్కువగా ఉండటం పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖమ్మం అర్బన్, తల్లాడ, పెనుబల్లి, ముదిగొండ మండలాల్లో హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. యూనిఫారాలు, పాఠశాలలకు సంబంధించిన నిధులు, క్యాడర్ కేటాయింపులు తదితర అంశాల్లో విద్యార్థుల హాజరు కీలకంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
దీపావళి అనంతరం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గత సంవత్సరం పదవ తరగతిలో 95 శాతం ఫలితాలు సాధించామని, ఈ ఏడాది 99 శాతం ఫలితాలను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు.
ముందుగా ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యార్థి స్థాయిలో ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తించాలని ఆదేశించారు. బలహీనంగా ఉన్న విద్యార్థులను సంబంధిత ఉపాధ్యాయులు దత్తత తీసుకుని, వారికి ప్రత్యేకంగా బోధించి ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు.
మన ఉపాధ్యాయులు విద్యాపరంగా ఎంతో బలమైన వారని, ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు పదవ తరగతి పరీక్షలో 60 నుంచి 70 మార్కులకు వచ్చే ప్రశ్నలను సులభంగా అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉన్నారని , అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎందుకు ఫెయిల్ కావాలని ప్రశ్నించారు.
గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలను పూర్తిగా విశ్లేషించి, తక్కువ ఫలితాలు సాధించిన పాఠశాలలను గుర్తించాలని, ఆయా పాఠశాలల్లో ఫలితాలు తక్కువగా రావడానికి గల కారణాలను గుర్తించి వాటిని వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యాశాఖలో అన్ని స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి అంశాలు, ప్రమాణాలతో కూడిన కామన్ రివ్యూ ఫార్మాట్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి డి. వాసంతి, మండల విద్యాధికారులు, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.