డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
స్థానిక డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ కార్లో, ఫాదర్ శౌరి, ప్రిన్సిపాల్ ఫాదర్ అనూప్, వైస్ ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ కార్లో, ప్రిన్సిపాల్ ఫాదర్ అనూప్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇటువంటి వేడుకల ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి పట్ల అవగాహన పెంపొందుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.