టెలికాం నగర్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ.. అసంపూర్తి పనులు పూర్తి చేస్తాం: పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
యూజీడీ పనుల పూర్తి, రోడ్ల మరమ్మతులు, పార్కుల అభివృద్ధికి హామీ
గచ్చిబౌలి: అక్టోబర్ 28
ప్రజావాణి
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవ చూపారు. కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజు ఆధ్వర్యంలో టెలికాం నగర్ కాలనీ వాసులు బుధవారం వివేకానంద నగర్‌లోని గాంధీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. టెలికాం నగర్ అభివృద్ధికి గాంధీ గతంలో విశేష కృషి చేశారని, కాలనీలో అనేక మౌలిక వసతులు కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలిపోయిన భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులను పూర్తి చేయాలని, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, కాలనీలోని పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం
కాలనీ వాసుల విజ్ఞప్తిపై పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. టెలికాం నగర్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట రోడ్లను పునరుద్ధరించి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తామని తెలిపారు.
అలాగే కాలనీలోని పార్కులను అభివృద్ధి చేసి, పచ్చదనంతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలి డివిజన్ సమగ్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని గాంధీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టెలికాం నగర్ కాలనీ వాసులు సుస్మిత, రామారావు, దత్తు, నరేంద్ర, రాంబాబు, గంగ, కోటేశ్వరరావు, కృష్ణారావు, విజయలక్ష్మి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.