prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 3:38 pm Digital Edition : PRAJA VANI

జర్నలిస్టుల డిమాండ్లను సర్కారు వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్

*జర్నలిస్టుల డిమాండ్లను సర్కారు వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్

*మీడియాపై దాడులు అరికట్టి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి*

పటాన్‌చెరు, అక్టోబర్‌ 3 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవభారత్‌ నిర్మాణ్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగ, ఆరోగ్య, నివాస భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలు కేటాయించాలని, వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆరోగ్య సదుపాయాలు అందేలా ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని కోరారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా అక్రిడిటేషన్‌ కార్డులు అందించాలని అన్నారు.
జర్నలిస్టులు, మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం తగిన వేతన విధానాన్ని అమలు చేయాలని అన్నారు.
జర్నలిస్టుల పని గంటలు, సెలవులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలని మెట్టు శ్రీధర్‌ కోరారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే జర్నలిస్టు సంఘాలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మెట్టు శ్రీధర్‌ హెచ్చరించారు.