*జర్నలిస్టుల గళం..
ప్రభుత్వానికి పోస్ట్‌కార్డులతో నిరసన!*
*మన ప్రజావాణి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి అక్టోబర్ 2
క్యాష్‌లెస్ వైద్యం కోసం జర్నలిస్టుల పోరుబాట*
*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..
కుత్బుల్లాపూర్‌లో భారీ నిరసన
వైద్య భరోసా కల్పించాలి.. జర్నలిస్టుల డిమాండ్*
*ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వైద్య సౌకర్యం కల్పించాలి*
మేడ్చల్: జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ హెచ్–143 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నగదు రహిత వైద్య సౌకర్యాన్ని కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.
షాపూర్‌నగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.నివాళులర్పించిన అనంతరం జర్నలిస్టులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం షాపూర్‌నగర్ ప్రధాన తపాలా కార్యాలయం వద్దకు చేరుకుని పోస్టుకార్డుల ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా భారతీయ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర సభ్యులు రంగు వెంకటేష్ గౌడ్, యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నప్పటికీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న తరహాలో జర్నలిస్టులందరికీ నగదు రహిత వైద్య కార్డులను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల కుటుంబాలకు వైద్యపరమైన భరోసా కల్పించేందుకు నగదు రహిత వైద్య సౌకర్యం ఎంతో అవసరమని, ఈ డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల ఇతర సమస్యలపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శివాజీ, కుత్బుల్లాపూర్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ హెచ్–143 అధ్యక్షులు సుగ్రీవుడు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, కోశాధికారి ఎర్రోళ్ల బాబు, తెలంగాణ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు ఎర్రోళ్ల కృష్ణ, కుత్బుల్లాపూర్ ఉపాధ్యక్షులు బాన్సువాడ వెంకటేష్, జుట్టు సాయిలు, కార్యదర్శులు ప్రసాద్, యేర్రం శ్రీనివాస్ గుప్తా, జుట్టు యాకుబ్, పల్నాటి శివకుమార్, పాండురంగం తదితరులతో పాటు జర్నలిస్టులు శ్రీరామ రాజు, ఎన్. శివకుమార్, సూర్యచంద్ర, ప్రసాద్, మహేష్, మణి ప్రసాద్, కామేష్ తదితరులు పాల్గొన్నారు.