*జనగామలో డ్రగ్స్ నిర్మూలన సదస్సుకు డీసీపీ, సీఐలకు ఏపూరి ఆహ్వానం*
జనగామ జిల్లా ప్రతినిధి (జె. ఉపేందర్), అక్టోబర్ 03 (ప్రజావాణి) : సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆట, పాటలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగా జనగామ నియోజకవర్గంలో త్వరలో నిర్వహించనున్న డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సుకు జనగామ డీసీపీ ఐపీఎస్ రాజమహేంద్ర నాయక్ ని, జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి ల ను బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న మర్యాదపూర్వకంగా శనివారం కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వరంగల్ వెస్ట్ జోన్ జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఐపిఎస్ మాట్లాడుతూ.. ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను గమనించి వారిని మంచి మార్గంలో నడిపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, యువకులే ఈ దేశ సంపద అని, వారికి ఒక మంచి లక్ష్యం ఉన్నప్పుడే సమాజంలో రాణిస్తారని, ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు.
ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, కవులు, కళాకారులు, పౌర సమాజం ప్రతి ఒక్కరూ డ్రగ్స్, గంజాయి చెడు అలవాట్లను నిర్మూలించాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న, కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డా.జేరిపోతుల పరశురామ్, కళాకారులు కడారి శ్రీను, జి. మౌనిక, పరమేష్, కె. ప్రవీణ్, పి. రేవంత్ తదితరులు పాల్గొన్నారు.