చౌకన్‌పల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..
.వి.బి.జి. రాంజీ పథకం కింద నూతన పనుల ఎంపికకు గ్రామసభ
.సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్‌ముఖ్
నారాయణఖేడ్, అక్టోబర్ 2 (ప్రజావాణి):
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం చౌకన్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్‌ముఖ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు త్వరగా ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నారని, స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమం విదేశీ వస్త్రాల బహిష్కరణ వంటి ఉద్యమాలు ఒక్క రోజులో విజయవంతం కాలేదని తెలిపారు. గాంధీజీ ప్రతిరోజు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి నిరంతరం గా చేసిన కృషి ఫలితంగానే ఆ ఉద్యమాలు విజయవంతమాయ్యాయని అన్నారు.స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గాంధీజీ అనేక కష్టాలను ఎదుర్కొని జైలు శిక్షను సైతం అనుభవించినప్పటికీ తన లక్ష్యాన్ని సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా పోరాటానికి కొనసాగించారని సర్పంచ్ తెలిపారు. నేటి యువత గాంధీజీ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరంతరం కృషి చేస్తూ తప్పకుండా ఫలితం సాధించవచ్చని సూచించారు. నిత్య జీవితంలో ఎదురయ్య ఒత్తిళ్లు సమస్యలను ధైర్యంగా అధిగమిస్తూ లక్ష్యం సాధన దిశగా ముందుకు సాగాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో వి.బి.జి. రాంజీ పథకం కింద నూతన పనుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్‌ముఖ్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో గ్రామానికి అవసరమైన పలు అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని ఎంపిక చేస్తూ తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మాట్లాడుతూ..వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి రైతు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల వద్ద నీటి గుంతలు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు.
గ్రామసభలో మట్టి రోడ్లు, ఇంకుడు గుంతలు, నీటి గుంతలు, పండ్ల తోటల అభివృద్ధి తదితర నూతన పనులను ఎంపిక చేసి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.