గ్యాస్ దుర్వాసనతో సూరారం గ్రామ ప్రజలకు తప్పని తిప్పలు
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారాం గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న రిలయన్స్ గ్యాస్ ప్రాంతం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ దుర్వాసన కారణంగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దగ్గు, తుమ్ములు, ఆయాసం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో దుర్వాసన మరింత తీవ్రంగా ఉండటంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని తెలిపారు.
విపరీతమైన దుర్వాసనతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోందని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ దుర్వాసనకు కారణాలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలని, అవసరమైతే దుర్వాసనకు కారణమవుతున్న కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని సూరారాం గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.