గోదావరి పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయాలి
నాణ్యతా ప్రమాణాలతో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్
భూపాలపల్లి , అక్టోబర్ 12 మన ప్రజావాణి : గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు.గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీ నుంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నాణ్యతా ప్రమాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా అధికారుల నుంచి జిల్లాలో చేపడుతున్న పుష్కరాల పనుల ప్రస్తుత పురోగతి, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె సమీక్షించారు. పనులను వేగవంతం చేసేందుకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, పుష్కరాల అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో దేవాదాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.