గిరిజన హక్కుల పోరాటానికి చిరునామా కొమురం భీమ్!
జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మొలుగు ఆనంద్ రావు
కూకట్‌పల్లి, అక్టోబర్ 22 (ప్రజావాణి):
తెలంగాణ గిరిజన విప్లవ యోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మొలుగు ఆనంద్ రావు ఘన నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
1901 అక్టోబర్ 22న జన్మించిన కొమురం భీమ్, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆదివాసీల హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. “జల్–జంగిల్–జమీన్” (నీరు–అడవి–భూమి) అనే నినాదంతో గిరిజనుల్లో చైతన్యం నింపి, వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించారు.
జోడేఘాట్ కేంద్రంగా గిరిజనులను ఏకం చేసి సాగించిన ఆయన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని మొలుగు ఆనంద్ రావు పేర్కొన్నారు. 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ ప్రాంతంలో వీరమరణం పొందినప్పటికీ, ఆయన ఆశయాలు నేటికీ ఆదివాసీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.
గిరిజనుల హక్కుల పరిరక్షణ, వారి అభివృద్ధి, సామాజిక గౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొమురం భీమ్ త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఆ మహనీయుడికి అందించే నిజమైన నివాళి అని మొలుగు ఆనంద్ రావు పేర్కొన్నారు.