గాంధీ భవన్లో బతుకమ్మ సంబురాలు!
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బతుకమ్మ
ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే పూల పండుగ: కాట సుధా శ్రీనివాస్ గౌడ్*
పటాన్చెరు అక్టోబర్ 14 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ప్రకృతిని ఆరాధిస్తూ, రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందన్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. మహిళల మధ్య ప్రేమానురాగాలను, ఐకమత్యాన్ని పెంపొందించే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.