prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 4:13 pm Digital Edition : PRAJA VANI

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణలో ఆచరించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను కార్యాచరణలో ఆచరించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి):
ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించడమే మహనీయులకు నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో 157వ గాంధీ జయంతి, 122వ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం, స్వచ్ఛ భారత్ దివస్ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ప్రజా సమస్యల పరిష్కారంలో నిష్పక్షపాత విచారణ, సత్యం, అహింస వంటి విలువలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను అనవసరంగా తిప్పడం కూడా ఒక రకమైన హింసే అని అన్నారు. ఫైళ్లను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ముఖ్యంగా దివ్యాంగులు, వితంతువులు, పేదలు వంటి వారు వచ్చినప్పుడు వారి సమస్యలను సానుభూతితో, సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

గాంధీజీ చెప్పిన తాలిస్మాన్ స్ఫూర్తితో ప్రతి నిర్ణయం తీసుకునే ముందు సమాజంలోని అత్యంత పేదలపై ఆ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలని సూచించారు.

ప్రభుత్వ భూములు, ఆస్తులను పరిరక్షించడం ప్రతి అధికారి బాధ్యత అని, ఆక్రమణలను గుర్తించి తొలగించాలని, రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

ప్రతి శాఖాధికారి తన పరిధిలోని సిబ్బంది సమయపాలన పాటించేలా, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దానిని బాధ్యతాయుతంగా, నైతిక విలువలకు అనుగుణంగా ఉపయోగించాలని సూచించారు.

73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత పెరిగిందని, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలని, నిధులను సక్రమంగా వినియోగించి ప్రజా అవసరాలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి అత్యున్నత నైతిక విలువలకు ప్రతీక అని, రైల్వే ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ఆయన ఆదర్శాన్ని ప్రతి ఉద్యోగి స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

అనంతరం అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ విలువలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, సర్వోదయ భావన అన్ని తరాలకు మార్గదర్శకమని అన్నారు.

తదనంతరం 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అభినందించి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.