prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 7:50 pm Digital Edition : PRAJA VANI

గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య
* వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్దాం
* కులకచర్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, గ్రామసభ

పరిగి అక్టోబర్02 (ప్రజావాణి)

“గ్రామమే మన బలం.. గ్రామాభివృద్ధే మన ప్రధాన లక్ష్యం. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి” అని కులకచర్ల గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం కులకచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కరణం ప్రహ్లాద్ రావు, ‘దిశ’ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ జానకీ రామ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ వార్డు సభ్యులు గాదె మహిపాల్ ప్రసంగించారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన గ్రామాల నిర్మాణమే అందరి కర్తవ్యం కావాలని వారు పేర్కొన్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతగా చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు. తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వార్డు సభ్యుడు మోత్కూర్ వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామసభ అనేది గ్రామంలోని సమస్యలను చర్చించి పరిష్కరించుకునే వేదిక అని తెలిపారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఎవరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని, దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ విజయకుమార్, వార్డు సభ్యులు జెల్ల నర్సిములు, గాదె లక్ష్మి, గొల్ల ఉదయ్, ఉత్తరకుమారి, పుట్టా రాధిక, ఐలాగారి రాజమ్మ, పోతగాళ్ల మంజుల, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.