prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:55 pm Digital Edition : PRAJA VANI

గాంధీజీ ఆశయాలు ఆచరణీయాలు.. సత్యం, అహింసే సమాజానికి మార్గదర్శకం

గాంధీజీ ఆశయాలు ఆచరణీయాలు.. సత్యం, అహింసే సమాజానికి మార్గదర్శకం

సత్యం.. అహింస.. శాంతి మార్గమే గాంధీజీ బాట

ఓదెల ప్రెస్ క్లబ్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ఓదెల ప్రెస్ క్లబ్ భవనంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఫని సుదర్శన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య సమరంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని సుదర్శన్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ మార్గాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నమ్ముకొని, అహింసా మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలనే గాంధీజీ సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సమాజంలో నెలకొనే విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంతో పాటు పరస్పరం గౌరవించుకుంటూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. గాంధీజీ ఆశయాలను కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా, ఆయన చూపిన విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, శాంతియుతమైన, సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు.
పాత్రికేయులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సమాజంలో చైతన్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని, గాంధీజీ పాటించిన నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి మారం తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు చెరుకు శంకర్, ప్రెస్ క్లబ్ సలహాదారు ఇరుకుల్ల వీరేశం, పాత్రికేయులు సల్పాల ప్రశాంత్, రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.