prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 12:12 pm Digital Edition : MAHESH MEDCHAL

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్

ఎల్లంపేట, అక్టోబర్ 2 (ప్రజావాణి):-
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఎల్లంపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్, మున్సిపల్ కమిషనర్ ఎన్. కృష్ణారెడ్డి హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు, ఆయన పాటించిన సత్యం, అహింస, శాంతి, పరిశుభ్రత వంటి సిద్ధాంతాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
మున్సిపల్ కమిషనర్ ఎన్. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన పౌర సేవలను అందించడంలో మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ ప్రజారోగ్యం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ సిబ్బంది సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో దుస్తులు, యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. సిబ్బంది తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.