గంజాయి సేవించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు అరెస్ట్
వంగపహాడ్ ఓఆర్ఆర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీలు.. 30 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం
హసన్‌పర్తి, అక్టోబర్ 29 (మన ప్రజావాణి):
గంజాయి కొనుగోలు చేసి సేవించేందుకు వచ్చిన ఇద్దరు యువకులను హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వంగపహాడ్ ఓఆర్ఆర్ కూడలి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 29వ తేదీ ఉదయం 11:30 గంటల సమయంలో వంగపహాడ్ ఓఆర్ఆర్ కూడలి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వంగపహాడ్ గ్రామం వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వారిని పట్టుకున్నారు.
అనంతరం వారిని విచారించగా వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన సయ్యద్ ముస్తఫా (30), మాచర్ల శివ అలియాస్ వంశీ (25)గా గుర్తించారు. వారి వద్ద ఉన్న తెల్లటి కవరును తనిఖీ చేయగా అందులో నిషేధిత గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
రెవెన్యూ అధికారుల ద్వారా నియమితులైన మధ్యవర్తుల సమక్షంలో విచారణ చేపట్టగా, ఇద్దరూ తలా రూ.500 చొప్పున మొత్తం రూ.1,000 కలిపి అక్టోబర్ 28వ తేదీన వరంగల్‌లో 30 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసినట్లు, దానిని సేవించేందుకు వంగపహాడ్ ప్రాంతానికి వచ్చినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం
నిందితుల నుంచి సుమారు రూ.1,500 విలువైన 30 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి కొనుగోలు లావాదేవీలకు ఉపయోగించిన సయ్యద్ ముస్తఫాకు చెందిన రెడ్మీ ఏ1 ప్లస్, మాచర్ల శివకు చెందిన ఒప్పో ఏ3ఎస్ సెల్ఫోన్లను కూడా జప్తు చేశారు.
హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.