prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 5:09 pm Digital Edition : PRAJA VANI

ఖమ్మం ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకురానున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

ఖమ్మం ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకురానున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం… !

శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం శుభసూచకమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు.

సోమవారం ఖమ్మం నగరంలోని కొత్తగూడెం అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్ లతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., కొత్తగూడెం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివ రావు, మట్టా రాగమయి దయానంద్, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ. శరత్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, తదితరులు పాల్గొన్నారు.
త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో శుభప్రదమని అన్నారు. దేశంలో ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా రైతులు, కుమ్మరులు సహా అన్ని వర్గాల ప్రజలు ముందుగా భగవంతుడిని స్మరించుకుని తమ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. భగవంతుడిని స్మరించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు టెలివిజన్ మాధ్యమం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మం నగరానికి విచ్చేసేందుకు నేడు తొలి అడుగు పడిందని అన్నారు. ఆశ్వయుజ మాసం సోమవారం నాడు ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన జరగడం దైవ సంకల్పమని పేర్కొన్నారు. స్వామివారు ఖమ్మం నగరాన్ని పవిత్రం చేసేందుకు స్వయంగా ఇక్కడకు వస్తున్నారని, ప్రజలందరికీ ఆశీస్సులు అందించనున్నారని తెలిపారు.
త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అలంకార సంప్రదాయానికి సంబంధించిన విశేషాలను వివరించారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారి కాలంలో ఏర్పాటైన సంప్రదాయం ప్రకారం, వారంలోని వివిధ రోజుల్లో స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించే విధానం కొనసాగుతోందని తెలిపారు.

ఈ సంప్రదాయాల వెనుక భగవంతుని ఆరాధన, ఆధ్యాత్మిక భావన, భక్తుల విశ్వాసం ఉన్నాయని తెలిపారు.ఆశ్వయుజ మాసం సోమవారం నాడే శ్రీనివాసుడు భూమిపై అడుగుపెట్టారని, అదే ఆశ్వయుజ మాసం సోమవారం నాడు ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన జరగడం దైవ సంకల్పమని , స్వామివారి అనుగ్రహానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మన దేశం, మన ధర్మం ప్రపంచానికి ఆదర్శమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఎలాంటి భేదభావాలు లేకుండా భగవంతుని అనుగ్రహం ఉండాలని కోరుకోవడం భారతీయ సంస్కృతిలోని గొప్ప లక్షణమని పేర్కొన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే వసుధైక కుటుంబ భావన మన ఆశయమని తెలిపారు.

శ్రీరాముడు బోయవాడిని, శబరిని, పక్షి రూపంలో ఉన్న జటాయువును, విభీషణుడిని కరుణించిన విషయాలను ప్రస్తావిస్తూ, భగవంతుని దృష్టిలో భక్తి, మంచి మనసు, ధర్మబద్ధమైన జీవనానికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.

పదిమందికి మేలు జరగాలని కోరుకునే వారందరూ మనవారేనని, ఇతరులకు హాని కలగాలని కోరుకునే వారు శత్రువులుగా మారుతారని అన్నారు. కృష్ణుడిని ఆరాధించేవారు మనకు మిత్రులు, ద్వేషించేవారు శత్రువులు అనే భావనను బోధాదేవి చెప్పినట్లు ప్రస్తావిస్తూ, మన మంతా ఇదే ధర్మసూత్రాన్ని అనుసరించాలని సూచించారు.

వేదాలు బోధించిన సన్మార్గాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా మనకు మిత్రులేనని తెలిపారు. కులాల ఆధారంగా విడిపోకుండా, మనమందరం ఒకే భగవంతుని సంతానమని, ఒకే భూమాతకు చెందినవారమని గుర్తించాలని అన్నారు. మనందరికీ ఉమ్మడి గుర్తింపుగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజలందరూ ధర్మమార్గాన్ని అనుసరించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రేరణ నిస్తుందని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు. ఆలయాలు కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ధర్మం, మానవత్వం, పరస్పర సహకారం, సమాజ శ్రేయస్సు వంటి విలువలను ప్రజల్లో పెంపొందించే కేంద్రాలుగా నిలవాలని అన్నారు.

శ్రీరాముడు, శ్రీ వేంకటేశ్వర స్వామి మధ్య విడదీయలేని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని పేర్కొన్నారు. భగవంతుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సమాజంలో సద్భావన, ఐక్యత పెంపొందాలని ఆకాంక్షించారు
ఖమ్మంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా విరాళాలు అందించాలని, ప్రతి భక్తుడు ఒక ఇటుక అందించినా ఆలయ నిర్మాణంలో భాగస్వామి అయినట్లేనని అన్నారు.

టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో త్వరలోనే సుందరమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆలయం ఖమ్మం ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచి, భక్తులకు స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఖమ్మం నగరానికి విచ్చేసి ప్రజలందరినీ ఆశీర్వదిస్తున్నారని, ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి కోరారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి, ఆలయ నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు, టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీరాముడి ఆశీస్సులతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తయి ఈ ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ ఖమ్మంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభం కావడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి ప్రధాన కారణమని అన్నారు. చిన్నతనంలో విక్రమార్కుడి గురించి చదువు కున్నామని, ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూపంలో అలాంటి వ్యక్తిత్వాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, రాబోయే ఏడాది కాలంలో ఐదు వేల ఆలయాలను నిర్మించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. అలిపిరి వద్ద రూ. 2,700 కోట్లతో సమగ్ర టౌన్‌షిప్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, రద్దీ సమయాల్లో సుమారు 20 వేల మందికి వసతి కల్పించేలా ఈ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

పశ్చిమ బెంగాల్, అస్సాం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ తర్వాత ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి అనుమతి లభించిందని, కరీంనగర్‌లోనూ త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవు తాయని చెప్పారు.

టీటీడీ నిబంధనల ప్రకారం స్థానిక ఆలయ నిర్మాణానికి 25 శాతం నిధులను స్థానిక భక్తులు సమకూర్చాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మంలో సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని టీటీడీకి కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.
టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ. శరత్ మాట్లాడుతూ “వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన। వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి॥” అనే శ్లోకం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమను తెలియజేస్తుందని అన్నారు.

టీటీడీ నమూనాలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఖమ్మంలో నిర్మితం కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా భూమి పూజ జరగడం మరింత విశేషమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర రాజధానులతో పాటు ముఖ్యమైన పట్టణాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ చర్యలు తీసుకుంటోందని అన్నారు. భక్తుల సహకారంతో ఖమ్మం ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

అనంతరం ఆలయ నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన దాతల వివరాలను మంత్రి వెల్లడించారు. ఎంపీ బండి పార్థసారథి రెడ్డి రూ.60 లక్షలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ తాతా మధు రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు చేసిన వ్యక్తి కూడా ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.11 లక్షలు విరాళంగా అందించారు. విరాళాలు ప్రకటించిన దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ప్రజా ప్రతినిధులు రాయల నాగేశ్వర రావు, విద్యుత్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, దేవాదాయ, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.