ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం…!
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను వ్యవసాయ, మార్కెటింగ్, ఇతర సంబంధిత శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు.
అధికారులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో వేడుకలను నిర్వహించారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వైభవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతిపై మనకున్న ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వివిధ రకాల సహజసిద్ధమైన పూలతో బతుకమ్మ లలను పేర్చి, వాటిని పూజిస్తూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని ఉద్యోగులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బతుకమ్మను ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పూల పండుగగా పేరుగాంచిన బతుకమ్మ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని, తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందించే గొప్ప వేడుక అని తెలిపారు.
ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించ నున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు నిర్దేశించిన శాఖల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోజుల వారీగా బతుకమ్మ వేడుకల నిర్వహణ బాధ్యతలను వివిధ శాఖలకు కేటాయించినట్లు తెలిపారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయని వివరించారు.
బతుకమ్మ వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, సహజసిద్ధమైన పూలు, పర్యావరణహిత వస్తువులను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ సూచించారు. చెరువులు, నిమజ్జన ఘాట్ల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, బతుకమ్మ పండుగను సంప్రదాయ వైభవంతో, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం చేపట్టిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య, కలెక్టరేట్ కేర్ టేకర్ వెంకన్న, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.