కోటగిరిలో వరి ధాన్యానికి దగా సిండికేట్‌గా మారిన రైస్‌మిల్లర్లు.
ఓపెన్ మార్కెట్ వ్యాపారస్తులను అడ్డుకుంటున్న వైనం.
రకాల పేరుతో రైతులను మోసగిస్తున్న వైన్యం.
మిల్లింగ్ సమయంలో కలపడం,కొనేటప్పుడు రకాలు అనడం ఎందుకు?
మిల్లర్ల ద్వందవైకరిని కట్టడి చేయాలని రైతుల డిమాండ్.
విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.

కోటగిరి/ప్రజావాణి:-స్థానిక రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి తమను నిలువునా దోచుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండల కేంద్రానికి చెందిన రైతులు గురువారం విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.కష్టపడి పండించిన వరి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర దక్కకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓపెన్ మార్కెట్ వ్యాపారస్తులను స్థానిక రైస్ మిల్లర్లు రాని వ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు.మిల్లర్లందరు ఒక్కటై సిండికేట్‌గా మారి కృత్రిమంగా ధాన్యం ధరలను తగ్గించి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా దగ్గర వడ్లు కొనేటప్పుడు సిద్ధి,గంగాకావేరి,కూనారం, బిపిటి అంటూ రకాన్ని బట్టి తక్కువ ధర కేటాయిస్తున్నారు. మరి ఇదే ధాన్యానికి మిల్లింగ్ చేసిన తర్వాత ఈ రకాల పేరుతో విడివిడిగా వినియోగదారులకు ఎందుకు విక్రయించడం లేదని వారు ప్రశ్నించారు.మిల్లింగ్ చేసేటప్పుడేమో అన్ని రకాలను కలిపేసి ఒకే రకమైన సన్న బియ్యం పేరుతో మార్కెట్లో అత్యధిక ధరలకు అమ్ముకుంటూ తమ దగ్గరికొచ్చేసరికి రకాల మధ్య వ్యత్యాసాలు చూపుతూ ధరలు కుదించి నట్టేట ముంచడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.ఈ మోసపూరిత వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.స్థానిక రైస్ మిల్లర్లు చేస్తున్న ఈ అక్రమాలను కట్టడి చేసి ఇతర ప్రాంతాల ఓపెన్ మార్కెట్ వ్యాపారస్తులను స్వేచ్ఛగా కొనుగోళ్లు చేసుకునేలా ప్రోత్సహించి తమకు న్యాయం చేయాలని వాపోయారు.