prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 12:20 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

కేఎల్ మహేంద్ర నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

పోచారం, అక్టోబర్ 10 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా కాలనీ మహిళలు ఉత్సాహంగా పాల్గొని పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాహలం, బతుకమ్మల అందాలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని కాలనీవాసులు పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ వేడుకలతో మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు కాలనీవాసుల మధ్య స్నేహభావం, ఐకమత్యం మరింత బలపడతాయని తెలిపారు. మహిళలంతా కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడంతో కాలనీలో సందడి నెలకొంది.