prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 3:30 pm Digital Edition : PRAJA VANI

కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలను కొనసాగిద్దాం – మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం

*కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలను కొనసాగిద్దాం – మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం*

*ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, ప్రముఖ వైద్యురాలు, మహిళా హక్కుల ఉద్యమ నాయకురాలు, కమ్యూనిస్టు నేత కెప్టెన్ డాక్టర్ లక్ష్మీ సెహగల్ జీవితం నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. శనివారం కెప్టెన్ లక్ష్మీ సెహగల్ జయంతి సందర్భంగా ఐద్వా నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటమే కాకుండా, మహిళల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం లక్ష్మీ సెహగల్ తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి, మహిళలతో ఝాన్సీ రాణి రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మహిళలు సైనిక రంగంలోనూ నాయకత్వం వహించగలరని తన ఆచరణ ద్వారా నిరూపించారని అన్నారు. వైద్యురాలిగా పేదలకు, కార్మికులకు సేవలందించిన లక్ష్మీ సెహగల్, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామ్యమై మహిళల విముక్తి కోసం పోరాటం కొనసాగించారని తెలిపారు. ఐద్వా స్థాపక సభ్యుల్లో ఒకరిగా మహిళా ఉద్యమానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. నేటికీ మహిళలపై వివక్ష, హింస, అసమానతలు కొనసాగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా మహిళలు సంఘటితమై పోరాడాలని ప్రభావతి పిలుపునిచ్చారు. మహిళలకు విద్య, ఉపాధి, సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు మహిళల భద్రతకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ చూపిన ధైర్యం, త్యాగం, సేవాభావం, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మహిళా హక్కుల సాధన కోసం ఐద్వా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కొండా అనురాధ, జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, బొల్లాపల్లి మంజుల, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.