కూసుమంచి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలి
మంత్రి పొంగులేటికి జాయింట్ యాక్షన్ కమిటీ వినతి
కూసుమంచి, అక్టోబర్ 11 (ప్రజావాణి): కూసుమంచి మండల కేంద్రంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు కూసుమంచి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానిక క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గత వారం రోజులుగా ప్రయాణికుల నుంచి సేకరించిన సంతకాలతో పాటు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉదయం హైదరాబాద్ బస్సులు పునరుద్ధరించాలి
కూసుమంచి నుంచి ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు, 4.30 గంటలకు నడిచే ఖమ్మం–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సులు రద్దు కావడంతో హైదరాబాద్ ఆసుపత్రులకు వెళ్లే రోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. రద్దు చేసిన సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులన్నీ 24 గంటల పాటు కూసుమంచి మీదుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక బస్సుల పేరుతో బైపాస్ మీదుగా వెళ్లే సర్వీసుల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాజధాని బస్సులకు కూసుమంచి బైపాస్ ఫ్లైఓవర్ వద్ద స్టాప్ సౌకర్యం కల్పించాలని కోరారు.
బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి
మండల కేంద్రంలో బస్‌స్టాండ్ లేకపోవడంతో విద్యార్థులు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండకు, వానకు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కనీస బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని లేదా తాత్కాలికంగా గ్రీన్‌నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు.
పండుగల వేళ అదనపు ఛార్జీలు రద్దు చేయాలి
పండుగల సమయంలో ప్రత్యేక బస్సుల పేరుతో సాధారణ ఛార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రయాణికులపై ఆర్థిక భారం మోపుతోందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తున్న తరహాలో తెలంగాణలోనూ అదనపు ఛార్జీలను రద్దు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్, వార్డు సభ్యులు చెరుకుపల్లి వీరయ్య, కొక్కిరేణి వెంకన్న, గంజి ఉదయ్ కుమార్, పిట్టల వేణు, అడపా శివ, బద్దం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.