కూరగాయల సంతలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
తనిఖీలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు..
కూసుమంచి ప్రజావాణి అక్టోబర్ 5: మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారపు కూరగాయల సంతకు చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. అయితే సంత జరిగే ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు వాహనాల తనిఖీలు చేపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వాపోతున్నారు.
కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని సైతం వాహనాల తనిఖీల పేరుతో ఆపడంతో మహిళలు, వృద్ధులు, రైతులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. పోలీసుల తనిఖీల కారణంగా సంతకు రావాలంటేనే కొంతమంది భయపడుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ, సంతకు వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తనిఖీలను సంతకు కొంత దూరంలో నిర్వహించాలని కోరుతున్నారు.
పోలీసులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.