prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 3:21 pm Digital Edition : PRAJA VANI

కూకట్‌పల్లి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కూకట్‌పల్లి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

సి‌ఎం‌సి కమిషనర్ సృజనతో బండి రమేష్ సమావేశం

పార్కుల అభివృద్ధి, నాలాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, నల్లచెరువులో స్టాల్స్ ఏర్పాటుపై చర్చ

కూకట్‌పల్లి, అక్టోబర్ 29 (ప్రజావాణి)

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ కోరారు. ఈ మేరకు సీ‌ఎం‌సి కమిషనర్ సృజనను కలిసి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో పార్కుల అభివృద్ధి, స్వాన్ లేక్ నాలా, బాలానగర్ నాలా పనులు, ఆరో ఫేజ్ స్పేస్‌లో పార్కు రిటైనింగ్ వాల్ నిర్మాణం, సబ్దాన్‌నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో డోర్ నంబర్ల సమస్యల పరిష్కారం, భూమన విజయ కోర్టు ఇండోర్ స్టేడియం, మూసాపేట్ రోడ్డు విస్తరణ వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా కాజాకుంటలో రజకుల కోసం షెడ్డు, బోరు ఏర్పాటు, వై జంక్షన్ ఫ్లైఓవర్ పనులు, అల్లాపూర్‌లోని ఇందు గ్రేవ్‌యార్డ్ సమస్య పరిష్కారం, కూకట్‌పల్లిలో లైబ్రరీ ఏర్పాటుకు స్థలం కేటాయింపు, ఎస్‌ఎన్‌డీపీ పనుల్లో భాగంగా బాలానగర్ నాలా, జింకలవాడ నాలాల అభివృద్ధి, నల్లచెరువు ప్రాంతంలో స్టాల్స్ ఏర్పాటు, విద్యుత్ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, అవసరమైన చోట నూతన అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, నియోజకవర్గంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని బండి రమేష్ కోరారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.