prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 9:44 am Digital Edition : PRAJA VANI

కుల వివక్షత తొలగితేనే దేశ ప్రగతి సాధ్యం – అప్పాల ప్రసాద్ జీ

కుల వివక్షత తొలగితేనే దేశ ప్రగతి సాధ్యం – అప్పాల ప్రసాద్ జీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ , అక్టోబర్ 28(ప్రజావాణి): కుల వివక్షత, సామాజిక అసమానతలు, అంటరానితనం సమాజం నుంచి పూర్తిగా తొలగిపోయినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందని సామాజిక సమరసతా వేదిక జాతీయ సాంస్కృతిక విభాగ కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు.

సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ భవన్ లో బుధవారం “గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం” అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామ పెద్దలకు మార్గదర్శనం చేశారు.
జనగామ, లింగాల ఘనపురం మండలాల పరిధిలోని 25 గ్రామాల నుంచి అన్ని కుల సంఘాలకు చెందిన పెద్దలు, కుల పెద్దలు, యువ నాయకులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. తమ గ్రామాల్లో తాము కులాలకు అతీతంగా కలిసి నిర్వహిస్తున్న సామూహిక భజన కార్యక్రమాలు, దేవాలయ ఉత్సవాలు, గ్రామ శుభ్రత, పండుగ వేడుకలు తదితర అంశాలపై తమ అనుభవాలను వేదికపై పంచుకున్నారు.

ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే. గ్రామాల్లో అంటరానితనం, వివక్షత తొలగిపోతేనే జాతీయ సమైక్యతకు అంకురార్పణ జరుగుతుందని, గ్రామ పెద్దలు కలిసి కూర్చుని చర్చించుకుని అన్ని వర్గాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించాలన్నారు.
హిందూ సమాజంలోని అన్ని పండుగలు, ఉత్సవాలు ఏ ఒక్క కులానికో పరిమితం కాకుండా అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉమ్మడిగా, ఎలాంటి అసమానతలు లేకుండా జరుపుకోవాలని. అప్పుడే “హిందూ సంఘటన్” సాధ్యమవుతుందన్నారు.
భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనకు ముందు కుల వ్యవస్థ అనే వివక్ష లేదు. ప్రజలంతా తమ తమ వృత్తుల్లో అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ఒకరి వృత్తికి మరొకరు సహకరించుకుంటూ సోదరభావంతో జీవించేవారని. బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే దుర్మార్గపు విధానంలో భాగంగా భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనే చిచ్చును రగిలించి ఆజ్యం పోసిన ఘనత వారిదేనని చరిత్ర చెబుతోందని గుర్తు చేశారు.
నేటి యువతలో కుల వివక్షత లేకుండా స్నేహ తత్వం, ఆత్మీయత, దేశభక్తి పెంపొందుతోందని. అభివృద్ధే లక్ష్యంగా “ఒకే దేశం – ఒకే ప్రజ” అనే నినాదాన్ని యువత బలంగా ముందుకు తీసుకెళుతుండటం హర్షణీయమని, అటువంటి యువతను అభినందించారు.
ఒకే దేశం ఒకే ప్రజ అనే నినాదంతో జాతీయ స్థాయిలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి సామాజిక సమరసతా వేదిక జనగామ జిల్లా అధ్యక్షులు నీలం స్వామి అధ్యక్షత వహించారు. కార్యక్రమ సమన్వయకర్తగా ఎస్.పి.ఆర్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ కీర్తి వీరేందర్ వ్యవహరించారు.

ఆర్గనైజర్లుగా పిట్టల సత్యం, అయిలా సోమ నరసింహచారి, మంగళంపల్లి రాజు, శ్రీనివాస్ వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో జనగామ పట్టణానికి చెందిన వివిధ సంఘాల నాయకులు, 25 గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనగా, వారందరినీ వేదికపై ఘనంగా సన్మానించి సత్కరించారు.