prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:51 pm Digital Edition : PRAJA VANI

కుల్కచర్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

కుల్కచర్లలో పోలీసుల విస్తృత తనిఖీలు: 56 వాహనాలు, 34 లీటర్ల మద్యం స్వాధీనం
పరిగి, అక్టోబర్ 9( ప్రజావాణి)
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. పరిగి డీఎస్పీ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో 107 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామంలోని పలు వీధుల్లో విస్తృతంగా ఇళ్లు, అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన 34 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేరాల అదుపునకు పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. రహదారి భద్రత కోసం వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కాలనీలు, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవడం సులువవుతుందని సూచించారు. గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోడంగల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, పరిగి సీఐ కొండల్ రెడ్డిలతో పాటు కుల్కచర్ల, పరిగి, చేగుంట, దోమ, కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, 12 మంది మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.